కోటగిరి, జూలై 9 :ఆ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. పల్లెప్రకృతి వనం ఆహ్లాదం పంచుతున్నది. గ్రామంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుండడంతో అంటువ్యాధులు, విషజ్వరాల జాడలేదు. వైకుంఠధామం నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు తొలగిపోయాయి. మొత్తంగా పల్లెప్రగతితో కోటగిరి మండలం హంగర్గఫారం పంచాయతీ రూపురేఖలు మారాయి.
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం హంగర్గఫారం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లెప్రగతి కార్యక్రమం ఆ ఊరి రూపురేఖలు మార్చివేసింది. ప్రభుత్వం నిర్దేశించిన మౌలిక వసతులన్నీ సమకూర్చుకొని శోభాయమానంగా దర్శనమిస్తున్నది. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయ్యాయి, స్వచ్ఛ పల్లెగా ఫరిడవిల్లుతోంది. గ్రామంలోకి ప్రవేశించగానే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా కనిపించే హరితహారం చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. మొదటి విడుత పల్లెప్రగతిలో పాడుబడిన బావులను పూడ్చివేశారు. శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేశారు. పంచాయతీ పాలకవర్గబాధ్యులు, ప్రభుత్వ సహకారంతో, గ్రామస్తుల ఐక్యతతో మౌలిక వసతులన్నింటినీ సమకూర్చుకొని గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు.
ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు..
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపడుతున్నారు. రోజూ ట్రాక్టర్‌తో చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తుండడంతో గ్రామం శుభ్రంగా కనిపిస్తుంది.
రూ.10.50 లక్షలతో వైకుంఠధామం..
గ్రామానికో వైకుంఠధామం నిర్మించాలని రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం హంగర్గాఫారం గ్రామానికి అందివచ్చిన అవకాశంగా మారింది. అప్పటి వరకు గ్రామంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు సరైన స్థలం లేక గోసపడేవారు. వైకుంఠధామం నిర్మించడంతో గ్రామస్తుల అవస్థలు ఇకపై తీరుతాయనే ఆశలు చిగురించాయి. దీంతోపాటు గ్రామంలో రెండు విలేజ్ పార్కులు, డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు.
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనాలు..
హంగర్గఫారం గ్రామంలో రెండు పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. పూలు, అందాన్నిచ్చే మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగాయి. గ్రామంలో సీసీ రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలు దర్శనమి స్తున్నాయి.