Rahul Gandhi : దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు సిద్దమవుతున్నారు. దీనిలో భాగంగా మొదట రాజస్థాన్లోని కోట పట్టణంలో రాహుల్ ఆందోళన చేపట్టనున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు తరలిరావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17, బుధవారం నాడు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొంటారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశంలోని విద్యార్థులు, యువత, నిరుద్యోగుల కలల్ని కేంద్రం అణిచివేస్తోందన్నారు. యువతకు సమాన అవకాశాలు అందడం లేదని, పరీక్షల నిర్వహణలో అస్థిరత వల్ల ఏళ్లతరబడి విద్యార్థుల శ్రమ, సాధన వృథాగా పోతున్నాయన్నారు. వ్యవస్థలో వైఫల్యం, నియామకాల్లో లోపాల కారణంగా ఎందరో నిరుద్యోగులు, ఆశావహులు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ విమర్శించారు. పేపర్ లీక్ కావడం, మళ్లీ పరీక్ష నిర్వహించడం, నియామక ప్రక్రియ ఆలస్యం కావడం పరిపాలనా వైఫల్యంకంటే.. యువత భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. ఈ పరీక్షల కోసం వాళ్లు ఏళ్లతరబడి కఠోర సాధన చేస్తారని గుర్తు చేశారు.
అంత కష్టపడ్డ వారు అవకాశాలు పొందలేక.. నిరాశ, నిస్పృహలోకి వెళ్తున్నారని రాహుల్ గుర్తు చేశారు. అధికారంలో ఉన్నవాళ్లు వీటిని వినలేనప్పుడు.. ప్రజలు తమ గొంతుకను మరింత గట్టిగా వినిపించాలి. సమష్టిగా స్పందించాలి’’ అని రాహుల్ కోరారు. దేశ యువత కోసం, వారి భవిష్యత్ కోసం ఈ ఉద్యమాన్ని నడుపుతున్నట్లు రాహుల్ వెల్లడించారు. జూలై 14 వరకు రాహుల్ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.