Rahul Gandhi : ఎన్నికల్లో ఓట్ల చోరీ (Vote theft) కి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం (NDA govt) అధికారంలోకి వచ్చిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం (Election Commission) అధికార బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని మరోసారి ఆరోపించారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటి తేదీని ఎన్నికల కమిషన్‌కు బదులుగా బీజేపీ నిర్ణయిస్తోందని రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. ఓట్ల చోరీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఎందుకు ఒక్కమాట కూడా మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ‘ఓటరు అధికార యాత్ర’లో భాగంగా బిహార్‌లో పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ మంగళవారం మధుబనిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.
ఎన్డీఏ ప్రభుత్వం మరో 40 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని అమిత్‌షా అన్నారని, ఆ విషయం ఆయనకు ఎలా తెలుసని రాహుల్ ప్రశ్నించారు. ఓట్ల చోరీకి పాల్పడితే ఎన్నేళ్లయినా అధికారంలో ఉండవచ్చని ఎద్దేవా చేశారు. కొన్నేళ్ల క్రితం గుజరాత్ ఎన్నికల్లో మొదలైన ఈ ఓట్ల చోరీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరకు వచ్చిందని అన్నారు. ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కచ్చితంగా ఎన్నికల తేదీలను మారుస్తారని ఆరోపించారు.
వీటి గురించి ఎవరూ ప్రశ్నించకుండా, ఎన్ని అక్రమాలు జరిగినా ఎన్నికల కమిషన్‌పై కేసు నమోదు చేయకుండా చట్టం తీసుకొచ్చారని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కొత్త ఓటర్లు వచ్చారో అక్కడ బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఎన్నికల కమిషన్ అధికారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై ఎప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బీహార్ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఇండియా కూటమి ఎంత దూరమైనా వెళ్తుందని రాహుల్‌గాంధీ చెప్పారు. ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ గౌరవించలేదని, అది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని అన్నారు. ఇప్పుడు మనం ఓటు హక్కును కోల్పోతే రాజ్యాంగాన్ని ఎన్నటికీ రక్షించుకోలేమని చెప్పారు.