న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : ఓటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.. ఎన్నికల ముందు కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను ఓ పద్ధతి ప్రకారం ఎలా తొలగించిందీ ఆయన ఆధారాలతోసహా వివరించారు. సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. గురువారం కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్లో విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఈసీ ఈ అక్రమాలను వెంటనే నిలిపివేసి ఓట్ల తొలగింపు వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న కర్ణాటక సీఐడీ కోరిన సమాచారాన్ని వారం రోజుల్లో అందచేయాలని డిమాండు చేశారు. తాను నేడు వెల్లడించిన విషయాలు హైడ్రోజన్ బాంబు కాదని, త్వరలోనే దాన్ని కూడా బయట పెడతానని రాహుల్ స్పష్టం చేశారు. 2023లో కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లను తొలగించడానికి జరిగిన ప్రయత్నాలను రాహుల్ వెల్లడించారు. అంతేగాక మహారాష్ట్రలోని రజూరా నియోజకవర్గంలో ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మోసపూరితంగా ఓటర్లను చేర్చారని కూడా ఆయన తెలిపారు. ఓటు దొంగలను, భారతీయ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని రాహుల్ తీవ్రంగా ఆరోపించారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఓటర్లను జాబితా నుంచి ఎవరో ఓ పద్ధతి ప్రకారం తొలగిస్తున్నారని చెప్పారు.
కర్ణాటకలోని అలంద్‌లో 6,018 ఓట్లను తొలగించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించి కాకతాళీయంగా దొరికిపోయినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన ఓటర్ల పేర్లను ఓ పద్ధతి ప్రకారం తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆటోమేటెడ్‌గా ఓటు తొలగింపు యత్నాన్ని ఎదుర్కొన్న ఓ ఓటరును వేదికపైకి పిలిచి వారిచేత రాహుల్ మాట్లాడించారు.
ఓ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఓట్ల తొలగింపులు జరుగుతున్నాయని రాహుల్ తెలిపారు. ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంపై కర్ణాటకలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ దరఖాస్తులు ఏ మొబైల్ ఐపీ నుంచి దాఖలయ్యాయో, వాటి ఓటిపీ నంబర్లు ఏమిటో చెప్పాలని కోరుతూ 18 నెలల్లో 18 సార్లు ఎన్నికల కమిషన్‌కి కర్ణాటక సీఐడీ లేఖలు రాసిందని రాహుల్ వివరించారు. ఈ ఆపరేషన్ ఎక్కడి నుంచి జరిగిందో బయటపడుతుందన్న కారణంతోనే సీఐడీ కోరిన సమాచారాన్ని ఈసీ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అసత్యం, ఆధార రహితమై నవని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం ఖండించారు. రాహుల్ గాంధీ భావించినట్టు ప్రజలెవరూ ఆన్లైన్ ద్వారా ఓటును తొలగించ లేరని స్పష్టం చేశారు.