Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ప్రధానిపై విమర్శలు చేశారు. ఆదివారం బీహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ఓట్ల కోసం ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఏం చేయడానికైనా వెనకాడబోరని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ బీహార్‌కు వచ్చి అనేక ప్రసంగాలు, వాగ్దానాలు చేస్తారని, ఎన్నికల తర్వాత రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడరని రాహుల్ విమర్శించారు.
బీహార్‌లో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగం గురించి ప్రశ్నలు లేవనెత్తకుండా యువత దృష్టిని మళ్లించడానికి వారిని రీల్స్ చూడాలని మోదీ కోరుతున్నారని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఉత్తమ విద్య, ఉద్యోగ అవకాశాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నలంద వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్ని బీహార్‌లో ప్రారంభిస్తామన్నారు.
ఇండియా కూటమిని గెలిపిస్తే రాష్ట్రంలో రైతులు, కార్మికులు, దళితులు, బలహీనవర్గాలకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. భారత్-పాకిస్థాన్ సైనిక ఘర్షణను ఆపానని ట్రంప్ పదేపదే చెబుతున్నప్పటికీ.. ఆయనను నిలదీసి ప్రశ్నించే ధైర్యం మోదీకి లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలు వంటి నిర్ణయాలన్నీ దేశంలోని కొందరు వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చేవేనన్నారు.
కానీ తాము మాత్రం చిరు వ్యాపారులు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తామని చెప్పారు. మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలపై మేడిన్ బీహార్ అనే ముద్రను చూడాలనుకుంటున్నామని తెలిపారు.