న్యూఢిల్లీ, నవంబర్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్‌లో 10.05 శాతంతో నిరుద్యోగిత రేటు రెండేండ్ల గరిష్ఠానికి చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్, ఆర్థికవేత్త రఘురాం రాజన్ దేశంలో ఉపాధి సమస్యను ఎత్తిచూపారు. దేశంలో ఉద్యోగాల కల్పన తగినంతగా లేదని పేర్కొన్నారు. దేశంలోని యువతకు, ఉపాధి కోరుకొనే వారికి ఉద్యోగాలు కల్పించేందుకు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం మధ్యలో ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
బీజింగ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజన్ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. దేశంలో సరిపడా ఉద్యోగాల కల్పనకు అవసరమైన దాని కంటే వృద్ధి రేటు నెమ్మదిగా ఉన్నదని, ఉపాధి కోసం పెద్దయెత్తున యువత ఎదురుచూస్తున్నదని అన్నారు. అదేవిధంగా తయారీ రంగంలో సమర్థవంతమైన దేశాలుగా ఉన్న చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీపడేలా మన శ్రామిక శక్తికి తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయాలని అభిప్రాయపడిన రాజన్.. చిప్ తయారీ రంగంలో పలు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉన్నదని అన్నారు. కాగా, దేశంలో ఉపాధి సమస్యను పరిష్కరించాలంటే భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధి రేటు సాధించాలని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. 7.5 శాతం వృద్ధి రేటుతో రాబోవు పదేండ్లలో 7 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉన్నదని, దాంతో కూడా ఉద్యోగ సమస్యలో మూడింట రెండొంతుల పరిష్కారం మాత్రమే లభిస్తుందని పేర్కొన్నది.
దేశంలో ఏటా లక్షలాది మంది శ్రామికశక్తిలో చేరుతుంటారు. అయితే వారికి ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కార్ విఫలమైందనే విమర్శలు పెద్దయెత్తున ఉన్నాయి. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్‌లో నిరుద్యోగిత రేటు 10.05 శాతానికి చేరింది. ఇది గత రెండేండ్లలో ఇదే అత్యధికమని సీఎంఐఈ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.