Raghav Chadha : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారం పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చేవరకూ సీఎం పగ్గాలు చేపట్టబోనని చెప్పారు.
కాగా కేజ్రీవాల్ సంచలన ప్రకటనపై పార్టీ సీనియర్ నేత రాఘవ్ చద్దా స్పందించారు. కేజ్రీవాల్ తన పదవిని త్యజించి అగ్నిపరీక్షకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. ఆప్‌నకు ఓటు వేయడం ద్వారా కేజ్రీవాల్ నిజాయితీపరుడని ఢిల్లీ ప్రజలు నిర్ధారించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ దీవార్ మూవీలోని సన్నివేశాన్ని తలపిస్తూ ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అమాయకుడని తమ చేతిపై రాసుకోవాలని చద్దా కోరారు.
ఢిల్లీ ప్రజలు తమ తీర్పును వెలువరించేవరకూ తాను సీఎం స్ధానంలో కూర్చోబోనని వెల్లడిస్తూ రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం ఆప్ వర్గాల్లో కలకలం రేపింది. ప్రజా తీర్పు అనంతరమే తాను సీఎం పదవి చేపడతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ అమాయాకుడా..? దోషా..? అని తాను ఢిల్లీ ప్రజలను అడగదలుచుకున్నానని చెప్పారు. ఢిల్లీ నూతన సీఎంను ఎన్నుకునేందుకు ఆప్ ఎమ్మెల్యేలతో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మహారాష్ట్రతో పాటు ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
Read More :
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే