లక్నో : అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం మరికొద్ది వారాల్లో జరగనుండగా రాముడి గుడి పేరుతో చందాల దందాతో కొందరు భక్తులను మోసగిస్తున్న స్కాం (QR Code Scam) వెలుగుచూసింది. మందిరం పేరుతో విరాళాలు వసూలు చేస్తూ దండుకుంటున్న ముఠాపై చర్యలు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) డిమాండ్ చేసింది. ఈ స్కాం ఉచ్చులో పడరాదని భక్తులను సోషల్ మీడియా వేదికగా వీహెచ్పీ ప్రతినిధి వినోద్ బన్సల్ హెచ్చరించారు.
శ్రీరామ్ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ పేజ్ క్రియేట్ చేశారని బన్సల్ వెల్లడించారు. రామ మందిర నిర్మాణం పేరుతో విరాళాలు అందచేయాలని క్యూఆర్ కోడ్ కలిగిఉన్న ఈ పేజ్ భక్తులను తప్పుదారి పట్టిస్తోందని తెలిపారు. ఈ స్కాంపై తాము హోంమంత్రిత్వ శాఖతో పాటు ఢిల్లీ, యూపీలో పోలీస్ విభాగాలకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
అయోధ్యకు చెందిన ఓ వీహెచ్పీ సభ్యుడికి కూడా స్కామ్స్టర్ నుంచి ఇటీవల ఫోన్ కాల్ వచ్చినట్టు చెబుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మీకు తోచినంత విరాళం ఇవ్వాలని కోరుతూ మీ పేరును డైరీలో రాసి మందిర నిర్మాణం పూర్తికాగానే అయోధ్యకు ఆహ్వానిస్తామని, తాను అయోధ్య నుంచి మాట్లాడుతున్నానని కాలర్ చెప్పినట్టు సమాచారం. రామ మందిరం పేరుతో ప్రజలను మోసగిస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని వీహెచ్పీ ఓ వీడియో సందేశంలో కూడా భక్తులను హెచ్చరించింది.
Read More :
Arvind Panagariya | ఆర్థిక సంఘం ఛైర్మన్గా అరవింద్ పనగరియ నియామకం