పూరీ: ఒడిశాలోని పూరీలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 46 ఏండ్ల తర్వాత తెరుచుకొన్నది. ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మంది లోపలికి వెళ్లారు. భాండాగారంలోని ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల లెక్కింపు, గది మరమ్మతుల నిమిత్తం తలుపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకొన్నది. మధ్యాహ్నం 1.28 గంటలకు భాండాగారం తలుపులు తెరిచారు. ట్రెజరీని తెరిచిన సమయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్, ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్, జగన్నాథ్ ఆలయ ప్రధానాధికారి అరవింద పాధీ, ఏఎస్ఐ సూపరింటెండెంట్ గదనాయక్, పూరీ రాజు గజపతి మహారాజు ప్రతినిధి తదితరులు ఉన్నారు.
ఆలయ ప్రధానాధికారి అరవింద పాధీ మీడియాతో మాట్లాడుతూ ‘అధికారిక వ్యక్తులు ట్రెజరీ వద్దకు వెళ్లగా, తలుపునకు మూడు తాళాలు ఉన్నాయి. జిల్లా అధికారుల వద్ద ఉన్న తాళం చెవి పని చేయలేదు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో తాళాలను పగులగొట్టాం. ఆ తర్వాత లోపలికి వెళ్లి చెక్కపెట్టెలు, బీరువాల్లో ఉన్న ఆభరణాలు, ఇతర వస్తువులను పరిశీలించాం’ అని తెలిపారు. వాటన్నింటినీ ఆలయంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించామని, రూమ్‌కు సీల్ వేశామని తెలిపారు. భాండాగారం లోపల పరిస్థితిని పురావస్తు శాఖ ఏఎస్ఐ పరిశీలించిందని, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసినట్టు అధికారులు తెలిపారు.
‘తరలింపు ప్రక్రియ అంతా ఒకేసారి జరగాలి. అది ఈ రోజు సాధ్యం కాదు. భాండాగారంలో ఉన్న విలువైన వస్తువులను ప్రస్తుతానికి తరలించకూడదని కమిటీ నిర్ణయించింది’ అని అరవింద పాధీ వెల్లడించారు. బహుద యాత్ర, సునా వేశ కార్యక్రమాల అనంతరం ఆభరణాల తరలింపు తేదీని నిర్ణయిస్తాం అని తెలిపారు. మరమ్మతుల తర్వాత నిధిని తిరిగి ట్రెజరీలోకి తీసుకొస్తారని, తర్వాత లెక్కింపు ఉంటుందని అరవింద్ పాధీ తెలిపారు. అంతకుముందు విలువైన వస్తువులను తరలించేందుకు తయారు చేయించిన 15 చెక్కపెట్టెల్లో ఆరింటిని ఆలయానికి తీసుకొచ్చారు.
చివరిసారి 1978లో రత్న భాండాగారాన్ని తెరిచారు. ట్రెజరీలోని నిధి లెక్కింపునకు 70 రోజుల సమయం పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. 2018లో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే అసలైన తాళాలు లేకపోవడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది.
దశాబ్దాల తర్వాత గదిని తెరవడంతో విష సర్పాలు ఉండే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పాములు పట్టే నిపుణులను సిద్ధంగా ఉంచారు. అయితే పాములు ఏమీ లేవని అధికారులు తెలిపారు. ఆభరణాల బరువు, తయారీ వంటి వాటి వివరాలతో ప్రభుత్వం డిజిటల్ క్యాటలాగ్ సిద్ధం చేయనున్నది.