చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ఆద్మీ పార్టీ దూసుకుపోతున్నది. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ( Aravind Kejriwal ) మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం పంజాబ్‌కు వెళ్లారు. ఆదివారం కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించి అదేరోజు రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ అమృత్సర్, జలంధర్ పట్టణాల్లో కేజ్రివాల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రివాల్.. ఢిల్లీలోని పారిశ్రామికవేత్తలంతా బీజేపీ ఓటు బ్యాంకుగా ఉండేవారని అన్నారు. ఆ పారిశ్రామికవేత్తల్లో చాలామంది తన సామాజిక వర్గానికే చెందినవారే ఉన్నా తన పార్టీకి ఓటు వేసేవారు కాదని చెప్పారు. కానీ, తమ ఐదేండ్ల పాలన పూర్తయ్యేసరికి వారి హృదయాలను గెలుచుకున్నామని తెలిపారు.
ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వాళ్లు ఆమ్ఆద్మీ పార్టీకే ఓటేస్తున్నారని చెప్పారు. పంజాబ్‌లో కూడా తమకు ఓ ఐదేండ్లు అవకాశం ఇచ్చి చూడాలని ఓటర్లను కోరారు. ఐదేండ్లు అవకాశం ఇస్తే మీ హృదయాలను కూడా గెలుస్తామని అక్కడి ఓటర్లకు కేజ్రివాల్ హమీ ఇచ్చారు.