చండీఘఢ్ : పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలను బయటకు పంపుతామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోమని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నూతనంగా నియమితులైన అమరీందర్ సింగ్ రాజా స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ వేదికలపైనే నేతలు ప్రస్తావించాలని, సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని అన్నారు.
పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించేవారు మంత్రయినా, సీఎం అయినా, తాను అయినా పార్టీ నుంచి బయటకు సాగనంపుతామని తేల్చిచెప్పారు. ఇక అమరీందర్ సింగ్ రాజాతో పాటు సీఎల్పీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా, పంజాబ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ అషు సహా పలువురు పార్టీ నేతలు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి సంప్రదింపులు జరిపారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్ధానంలో అమరీందర్ సింగ్ రజాను ఏప్రిల్ 9న కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పంజాబ్ పీసీసీ చీఫ్గా నియమించారు. ప్రతాప్ సింగ్ బజ్వాను సీఎల్పీ నేతగా, రాజ్యసభ మాజీ సభ్యుడు రాజ్ కుమార్ చబ్బేవల్ను పంజాబ్ సీఎల్పీ ఉప నేతగా ఎంపిక చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం నేపధ్యంలో పార్టీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ నూతన నియామకాలను చేపట్టింది.