చండీగఢ్: పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. గురువారం మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోర్టు రూములను ఖాళీ చేయించారు. చడీగఢ్ పోలీసులతోపాటు రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది హైకోర్టుకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువును పరిశీలిస్తున్నారు.
అడ్వకేట్లు అంతా కోర్టు ఆవరణను విడిచి వెళ్లాలని బార్ అసోసియేషన్ కోరింది. అప్రమత్తంగా ఉండాలని, చుట్టుపక్కల పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసు లేదా బార్ అసోసియేషన్ సమాచారం అందించాలని తెలిపింది. బెదిరింపుల నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, అంబాలా రైల్వే స్టేషన్‌కు కూడా ఇదేవిధమైన బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తున్నది. బుధవారం మధ్యాహ్నం గురుగ్రామ్ మినీ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో సెక్రటేరియట్‌ను ఖాళీ చేయించిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించకపోవడంతో అది ఫేక్ అని నిర్ధారించారు.