Pune : ఎక్కువ ఖర్చుపెట్టి భార్య మామిడిపండ్లు కొనడంతో ఆమెపై ఆగ్రహంతో దాడి చేశాడు భర్త. ఈ ఘటనలో గాయాలపాలైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనేలో ఆదివారం జరిగింది. పూనేలోని ఒక హౌజింగ్ సొసైటీలో ఐటీ ఇంజనీర్ అయిన భర్త, అతడి భార్య ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఆమె ఇంటికి దగ్గర్లోని ఒక వ్యాపారి వద్ద రూ.850 విలువ గల మామిడి పండ్లు ఉన్న బాక్స్ కొనుగోలు చేసింది.
దీనికి డిజిటల్ పేమెంట్ చేసేందుకు వ్యాపారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను భర్తకు పంపించింది. రూ.850 పే చేయాలని సూచించింది. మామిడి పండ్లకు ఒక్కసారే రూ.850 ఖర్చు పెట్టడం ఏంటని భర్తకు ఆగ్రహ వచ్చింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం నడిచింది. భార్య ఇంటికి వచ్చాక ఇరువురి మధ్యా గొడవ జరిగింది. ఈ ఘటనలో భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటనను భార్య తన ఫోన్లో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ ఫోన్ లాక్కుని మరీ ఆమెపై దాడి చేయడంతో కంటికి గాయమైంది.
అనంతరం ఆమెను తిట్టి, అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ దాడిపై భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక ఆధారాల ద్వారా భర్తపై బీఎన్ఎస్ 118 (1), బీఎన్ఎస్ 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.