న్యూఢిల్లీ, జూన్ 4: భారతీయ జనతా పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో రెండు లక్ష్యాలతో బరిలోకి దిగింది. సొంతంగా 370 సీట్లు సాధించాలని, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ రెండింటికీ భారీ దూరంలో నిలిచిపోయింది. బీజేపీ 241 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. ఎన్డీఏ కూటమిగా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు. ఇందుకు ప్రధానంగా ఐదు కారణాలను రాజకీయ విశ్లేషకులు చూపిస్తున్నారు.
1. యూపీలో ఎదురుదెబ్బ
బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 80 సీట్లు ఉన్న యూపీలో 2019లో 62 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి కూడా కనీసం 60 స్థానాలు ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావించింది. అయితే, 33 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. ఇంతకాలం బీజేపీకి కంచుకోటలా భావించిన రాష్ట్రంలో ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో 43 స్థానాలను దక్కించుకొని బీజేపీకి ఊహించని విధంగా షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా బీజేపీ సీట్లు తగ్గడానికి యూపీ ప్రధాన కారణమైంది.
2. విఫలమైన రామమందిర ప్రచారం
అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం తమకు కలిసొస్తుందని బీజేపీ నేతలు అంచనా వేసుకున్నారు. ఈ అంశాన్ని బాగా ప్రచారం చేశారు. అయితే, అయోధ్య ప్రాంతంలోనూ రామమందిర నిర్మాణం రాజకీయ లాభాన్ని ఇవ్వలేదు. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓడిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ బీజేపీ కేవలం కైసర్‌గంజ్, గోండాలో మాత్రమే గెలిచింది. అమేథీ, బారాబంకిలో కాంగ్రెస్, సుల్తాన్పూర్, అంబేద్కర్‌నగర్, బస్తీలో సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది.
3. అగ్నిపథ్ పథకం పట్ల ఆగ్రహం
సైనిక బలగాల్లో నియామకాలకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కూడా బీజేపీకి నష్టం చేసింది. ఉద్యోగభద్రత కొరవడిన ఈ పథకం పట్ల యువతలో ఆగ్రహావేశాలు వ్యక్తమైనా బీజేపీ వెనక్కు తగ్గలేదు. ఈ ప్రభావం ఈ ఎన్నికల్లో చూపించింది. సైన్యంలోకి ఎక్కువ మంది యువతను పంపించే రాజస్థాన్, హర్యానాలో బీజేపీ బాగా నష్టపోయింది. హర్యానాలో 2019లో బీజేపీ మొత్తం 10 స్థానాలను గెలుచుకోగా ఈసారి మాత్రం ఐదు స్థానాల్లోనే గెలిచింది. గత ఎన్నికల్లో 25కు 25 స్థానాలు గెలిచిన రాజస్థాన్‌లో ఈసారి 14 మాత్రమే గెలుచుకుంది.
4. పార్టీలను చీల్చిన ఫలితం
మహారాష్ట్రలో గత మూడేండ్లుగా బీజేపీ ఆడుతున్న రాజకీయ ఆటలు కూడా ఆ పార్టీకి ఈసారి నష్టం చేశాయి. సుదీర్ఘకాలం మిత్రపక్షంగా కొనసాగిన శివసేనను చీల్చి, ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయడం, పార్టీ పేరు, గుర్తు కూడా దక్కకుండా చేయడంలో బీజేపీ మద్దతు ఉందనే వాదన ఉంది. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ని చీల్చడం వెనుకా బీజేపీ ఉందనే భావన ప్రజల్లో నెలకొన్నది. ఈ అంశాలు మహారాష్ట్రలో బీజేపీకి నష్టం చేశారు. మహారాష్ట్రలో 2019లో 23 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 10 సీట్లకే పరిమితమైంది.
5. కొత్త నేతలకు ఎదురుగాలి
ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నుంచి బీజేపీ పెద్ద ఎత్తున నేతలను చేర్చుకుంది. వీరి వల్ల బీజేపీకి కలిగిన లాభమేమీ కనిపించకపోగా నష్టం జరిగింది. ఇలా చేరిన వారికి బీజేపీ టికెట్లు ఇచ్చి బరిలో నిలిపినా ఎక్కువ మంది ఓడిపోయారు. పంజాబ్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రవ్నీత్ బిట్టు, ప్రనీత్ కౌర్, హర్యానాలో అశోక్ తన్వర్, జార్ఖండ్‌లో గీతా కోడా వంటి వారు ఓటమిని చవిచూశారు.