న్యూఢిల్లీ : అధికార దాహంతో ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఉగ్ర దాడికి పధక రచన చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో నెలకొన్న భద్రతా లోపం ఓ డ్రామా అని ఆయన అభివర్ణించారు. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన వెనుక మోదీ ఉన్నారని మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆరోపించారు.
సీఆర్పీఎఫ్ సైనికులన కాన్వాయ్‌లో ప్రయాణించేందుకు ఎందుకు అనుమతించారని, వారిని ఎయిర్‌లిఫ్ట్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం అంతకుముందు ఉగ్రదాడిపై సందేహం వ్యక్తం చేశారు. పుల్వామా దాడి నుంచి ఎవరు ఎక్కువ లబ్ధి పొందారని ప్రశ్నించిన రాహుల్ గాంధీ దాడికి దారితీసిన భద్రతా వైఫల్యాలపై ఎందుకు ఎవరినీ బాధ్యులుగా చేయలేదని నిలదీశారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చూసేందుకు ఇష్టపడని ప్రధాని మోదీ పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం ప్రధాని పర్యటనలో భద్రతా లోపం ఓ డ్రామాగా ఎద్దేవా చేశారు. మోదీ ర్యాలీకి జనం కరువై సభను రద్దు చేసకునే క్రమంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఈ డ్రామాను ముందుకు తెచ్చారని అన్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో బుధవారం రైతుల నిరసనలతో ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.