చండీఘఢ్ : డ్రగ్స్ కేసులో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత బిక్రం సింగ్ మజితియకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను జనవరి 12 వరకూ అరెస్ట్ చేయరాదని పంజాబ్ హర్యానా హైకోర్టు ముందస్తు బెయిల్ జారీ చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో తనను రాజకీయ దురుద్దేశంతో డ్రగ్స్ కేసులో ఇరికించారని మజితియ పేర్కొంటున్నారు. మజితియపై డ్రగ్స్ కేసులో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు మొహాలి పోలీస్‌స్టేషన్‌లో రాష్ట్ర పోలీస్ క్రైమ్ బ్రాంచ్ 49 పేజీలతో కూడిన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
అకాలీదళ్ నేత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మొహాలి కోర్టు గత నెలలో తోసిపుచ్చగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మజితియకు బెయిల్ మంజూరు చేస్తూ ఆయన విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. మజితియ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించగా పంజాబ్ ప్రభుత్వం తరపున మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం వాదనలు వినిపించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మజితియ డ్రగ్స్ కేసు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. విక్రం సింగ్ మజితియాపై డ్రగ్స్ ఆరోపణలున్నా ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకూ ఎందుకు అదుపులోకి తీసుకోలేదని సిద్ధూ రాష్ట్ర హోంమంత్రి సుఖిందర్ సింగ్ రంధ్వాను నిలదీశారు.