లక్నో: ఒక వ్యక్తి అదృశ్యంపై అతడితో సంబంధం ఉన్న మహిళను బహిరంగంగా అవమానించారు. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు. (woman dies by suicide) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల షిద్రా, మహమ్మద్ సమీర్ మధ్య ప్రేమ సంబంధం ఉన్నది. అయితే ఇటీవల సమీర్ అదృశ్యమయ్యాడు. షిద్రా కుటుంబం అతడ్ని కిడ్నాప్ చేసినట్లు సమీర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహిళను బహిరంగంగా దూషించి అవమానించారు. తీవ్ర మనస్తాపం చెందిన షిద్రా జూన్ 16న రాత్రి వేళ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, పోస్ట్‌మార్టం తర్వాత మహిళ మృతదేహాన్ని ఆమె కుటుంబానికి పోలీసులు అప్పగించారు. దీంతో షిద్రా కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం చెందారు. ఆమె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా స్థానికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు సమీర్ అదృశ్యం కాలేదని ఒక కేసు విషయమై ఘజియాబాద్ పోలీసులు అతడ్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. షిద్రా ఆత్మహత్యకు రెండు రోజుల ముందే అతడు గ్రామానికి చేరుకున్నాడని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
కాగా, సమీర్ తిరిగి వచ్చాడని షిద్రాకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అయితే పంచాయతీ సమయంలో ఎదుర్కొన్న అవమానం ప్రభావం వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆ మహిళను సమీర్ వాడుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఆరోపణలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.