RG Kar Case | కోల్‌కతాలో యువ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఐదోసారి చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు ఇదే చివరి ఆహ్వానమని స్పష్టం చేశారు. సమావేశం కాళీఘాట్ నివాసంలో సమావేశం జరుగనుండగా.. చర్చలకు హాజరయ్యేందుకు వైద్యులు అంగీకరించారు. సాయంత్రం 5 గంటలకు సమావేశానికి రావాలని ఆహ్వానించారు. అయితే, సమావేశం లైవ్ స్ట్రీమింగ్ చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. అయితే, లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు నిరాకరించిన ప్రభుత్వం.. వీడియో రికార్డ్ చేసేందుకు అంగీకరించింది. లైవ్ స్ట్రీమింగ్పై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ప్రభుత్వ చర్చలకు ఆహ్వానించినా వైద్యులు గైర్హాజరయ్యారు.
రెండురోజుల అనంతరం వైద్యులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. లేఖలో వైద్యులను చర్చల కోసం సంప్రదించడం ఐదోసారి అని.. ఇక ఇదే చివరిసారి అని పేర్కొంది. సీఎంతో చర్చలు జరిపేందుకు మరోసారి ఆహ్వానిస్తున్నామని.. కాళీఘాట్‌లోని సీఎం నివాసంలో ఓపెన్‌మైండ్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎస్ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో తెలిపారు. ఇంతకు ముందు ఈ నెల 14న సీఎంని కలిసిన వైద్యుల బృందాన్ని ప్రభుత్వ చర్చలకు ఆహ్వానించింది. 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నిరసన తెలుపుతున్నారు.