సిమ్లా: ఒక మసీదు వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా నిరసన చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ఆ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. (illegal mosque in Shimla) హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం స్థానికులు, బీజేపీ కార్యాకర్తలు, హిందూ సంఘాల సభ్యులు సంజౌలి మసీదు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ మసీదు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. అక్రమంగా నిర్మించిన దానిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. నాలుగంతస్తుల మసీదును పదేళ్ల కిందట చట్టవ్యతిరేకంగా నిర్మించినట్లు స్థానికులు ఆరోపించారు. అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్లో ముస్లింల సంఖ్య పెరుగుతోందని మరి కొందరు ఆరోపించారు. ఇక్కడి హిందువులపై ముస్లింలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి హిమాచల్ ప్రదేశ్కు వచ్చే వ్యక్తుల గురించి సరైన ధృవీకరణ ఉండాలని అన్నారు. ముస్లింల సంఖ్య పెరుగడంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర మంత్రి అనిరుధ్ సింగ్ కూడా అసెంబ్లీలో ఇలాంటి డిమాండ్లు చేశారు.
మరోవైపు ఆగస్టు 30న మాల్యానా ప్రాంతంలో ఒక వ్యాపారిపై దాడి జరిగింది. దీంతో ఈ ప్రాంతంలోని మసీదును కూల్చివేయాలని స్థానికులు ఆదివారం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిమ్లాలో గురువారం సనాతనీయుల సమావేశానికి దేవ్ భూమి శత్రియా సంఘటన్ అధ్యక్షుడు రుమిత్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తన పిలుపునకు స్పందించారని, సనాతన ఐక్యతను చాటారని ఆయన అన్నారు.