జమ్మూ: లడాఖ్‌లోని లేహ్ జిల్లాలో ఇవాళ నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. లడాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చాలని గత 35 రోజులగా విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ లేహ్‌లో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో స్థానికులు విధ్వంసం సృష్టించారు. లేహ్‌కు చెందిన యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. లడాఖ్ హక్కులను కేంద్రం కాలరాస్తున్నట్లు ఆరోపించారు.
నిరసన ప్రదర్శన ఒక్కసారిగా విధ్వంసకరంగా మారింది. లేహ్‌లో ఉన్న లడాఖ్ అటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫీసును ఆందోళనకారులు చుట్టుముట్టేశారు. బిల్డింగ్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు నిరసనకారుల్ని పోలీసులు అడ్డుకున్ఆనరు. ఆ సమయంలో వాళ్లు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. అనేక వాహనాలకు నిప్పుపెట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ కూడా చేశారు.
లడాఖ్‌లోని ముఖ్య ప్రతినిధుల బృందాలతో కేంద్ర ప్రభుత్వం చర్చల్లో నిమగ్నమైంది. లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ సంఘాల ప్రతినిధులు చర్చలు నిర్వహిస్తున్నారు. లేడాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని మూడేళ్లుగా ఈ సంఘాలు పోరాడుతున్నాయి. లేహ్, కార్గిల్‌లో ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.