ఇంఫాల్: కిడ్నాప్‌కు గురైన మహిళలు, పిల్లల హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై జనం దాడి చేశారు. (Protesters Attack Ministers Houses) న్యాయం కోసం డిమాండ్ చేశారు. కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణతో రగులుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. గతవారం జిరిబామ్‌లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు దాడి చేశారు. కొందరు మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది కుకీ మిలిటెంట్లు మరణించారు.
కాగా, కిడ్నాపైన ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేశారు. ముగ్గురి మృతదేహాలు శుక్రవారం రాత్రి నదీ సమీపంలో కనిపించాయి. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. దీంతో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్‌లో శనివారం భారీ నిరసన చేపట్టారు. తమ వర్గం హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసింది.
మరోవైపు పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని సగోల్‌బండ్ ప్రాంతంలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు గుమిగూడి నిరసన తెలిపారు. హత్యలపై ప్రభుత్వం స్పందించాలని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కైషామ్‌థాంగ్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే సపం నిషికాంత సింగ్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి నిరసనకారులు చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో ఆయన లేరని చెప్పడంతో ఆ ఎమ్మెల్యేకు చెందిన వార్తా పత్రిక కార్యాలయ భవనంపై దాడి చేశారు.
కాగా, ఈ ఆందోళనల నేపథ్యంలో పలు జిల్లాల్లో నిరవధిక నిషేధిత ఆంక్షలు విధించారు. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్‌పూర్‌లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.