అమృత్సర్(పంజాబ్), జూన్ 13: కొత్తగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం అమృత్సర్లోని గోల్డెన్ గేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరసనకు సారథ్యం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ విద్యార్థుల ఆందోళనలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలోని లోపాలు, పెరుగుతున్న విద్యా ఒత్తిడి దేశవ్యాప్తంగా విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. యువత ఏకమై తమ హక్కుల కోసం గళం విప్పాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమం కట్టుదిట్టమైనభద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే ఈ నెల చివరలో దేశవ్యాప్త ఉద్యమంతో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని దీప్కే హెచ్చరించారు. పలు నగరాల్లో నిరసన ద్వారా తమ కార్యకలాపాలను విస్తరించిన సీజేపీ పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతున్న తరుణంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది.