న్యూఢిల్లీ: వరుసగా జరుగుతున్న లైంగిక నేరాల కేసులు దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో సత్వర న్యాయం కోసం మహిళా సంఘాలు గళమెత్తాయి. లైంగిక నేరాలను అంతం చేయాలని డిమాండ్ చేశాయి. కోల్‌కతా, మణిపూర్, గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్లలో జరిగిన సంఘటనలు దేశంలో మహిళల భద్రతకు ఉన్న ముప్పును గుర్తు చేస్తున్నాయని 35 మహిళా సంఘాలు మంగళవారం విడుదల చేసిన స్టేట్మెంట్లో ఆరోపించాయి. కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం కేసును తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రభుత్వం ప్రయత్నించిందని దుయ్యబట్టాయి. నేరాలపై దర్యాప్తు చేసే యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని, పరిపాలన, దర్యాప్తు సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశాయి.
తోడేళ్ల దాడిలో ఏడుగురి మృతి
మరో 26 మందికి గాయాలు యూపీలో దారుణం
లక్నో: తోడేళ్లు గుంపుగా వచ్చి జరిపిన దాడుల్లో ఏడుగురు మరణించగా, 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. తోడేళ్ల వల్ల ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని 30 గ్రామాల ప్రజలు నెల నుంచి కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి, పహారా కాస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సురేశ్వర్ ప్రసాద్ కూడా ఓ తుపాకీ పట్టుకుని రాత్రి సమయంలో ఓ గ్రామానికి కాపలా కాశారు. ఈ తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ తొమ్మిది మందిని నియమించింది. మూడు తోడేళ్లను పట్టుకుని, లక్నో జంతు ప్రదర్శన శాలకు పంపించారు.
కునోలో మరో చీతా మృతి!
శ్యోపూర్, ఆగస్టు 27: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మంగళవారం నమీబియన్ మగ చీతా పవన్ మరణించిందని అధికారులు తెలిపారు. పొదల మధ్య నిండుగా ఉన్న కాలువ గట్టున మగ చీతా పవన్ కదలికలు లేకుండా పడి ఉన్నట్టు గుర్తించారు. తలతోపాటు శరీరంలోని సగ భాగం నీటిలో మునిగి ఉన్నట్టు పశు వైద్యులు గుర్తించారు. చీతా కళేబరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. నీటిలో మునగడం వల్లే చీతా మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు.