ముంబై, నవంబర్ 11: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధికార పత్రిక ‘సామ్నా’ కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో చట్టబద్ధమైన పాలన లేదని పేర్కొన్న సామ్నా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ‘బానిసలు’గా మారాయని శుక్రవారం తన సంపాదకీయంలో విమర్శించింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసిన తీరు ఇందుకు ఓ ఉదాహరణ అని పేర్కొన్నది. న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిడి ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొనేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని దుయ్యబట్టింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తదితర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఎత్తిచూపారని పేర్కొన్నది.