లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తన పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం రాత్రి తనను అడ్డగించిన పోలీసులు తనను నెట్టివేస్తూ దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. తన అరెస్ట్‌కు అవసరమైన పత్రాలు చూపకుండా అక్రమంగా నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు.లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళనలో హింస చెలరేగడంతో నలుగురు రైతులు సహా 8 మంది మరణించిన సంగతి తెలిసిందే.
కాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇతర నేతలను అడ్డుకుని అక్రమ నిర్బంధాలకు పాల్పడటాన్ని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ఖండించారు. విపక్ష నేతల నిర్బంధం ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రియాంకతో పాటు చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ఎస్ రాంధ్వా తదితరులను యోగి సర్కార్ అడ్డగించిందని చెప్పారు. నియంత ప్రభుత్వమే ఇలాంటి నిర్బంధాలకు పూనుకుంటుందని గెహ్లోత్ పేర్కొన్నారు. ఇక మరణంచిన రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ 45 లక్షల పరిహారం ప్రకటించింది.