న్యూఢిల్లీ : యూపీ సహా కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాల రద్ద నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ ప్రభుత్వం దేశాన్ని నడపలేదని మోదీ గుర్తెరిగారని శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్ధితులు తమకు అనుకూలంగా లేవని సర్వేల్లో వెల్లడవడంతో వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికలకు ముందు రైతులను ప్రధాని మోదీ క్షమాపణ కోరారని వ్యాఖ్యానించారు. 600 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా, లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లినా ప్రధాని మోదీ చలించలేదని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. రైతులను కాషాయ పార్టీ నేతలు అవమానించారని అన్నదాతలను ఉగ్రవాదులు, గూండాలు, దుండగులుగా అభివర్ణించి వారిని కర్రలతో కొట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు.