న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం జలంధర్ ర్యాలీలో ప్రధాని మోదీ తలపాగా ధరించి ప్రత్యక్షం కావడాన్ని ఉద్దేశించి ఎవరైనా తలపాగా ధరించగానే సర్ధార్ కాలేరని ప్రియాంక గాంధీ చురకలు వేశారు. వేదికపై నకిలీ తలపాగాతో దర్శనమివ్వగానే ఎవరూ సర్ధార్జీ కారని వారికి చెప్పండని అన్నారు. నిజమైన సర్ధార్ ఎవరో వారికి చెప్పండి. ఈ తలపాగాలో ఎంతటి ధైర్యం, కఠోరశ్రమ దాగుందో వారికి తెలియచెప్పండని ప్రియాంక పేర్కొన్నారు. పంజాబ్ పంజాబీలకు చెందినదని, దాన్ని వారు నడిపించుకుంటారని బీజేపీ, ఆప్‌లకు చెప్పండని సూచించారు. పంజాబ్‌లో ఓ పార్టీ గుజరాత్ మోడల్‌ను ముందుకుతెస్తుండగా మరో పార్టీ ఢిల్లీ మోడల్ అంటూ హడావిడి చేస్తోందని బీజేపీ, ఆప్‌లపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.
గుజరాత్ మోడల్‌ను మీరు పరిశీలిస్తే ఏ ఒక్కరికి ఉద్యోగాలు అందుబాటులో ఉండవని, వ్యాపారాలు సజావుగా సాగవనీ, ఎలాంటి నిధులూ సమకూరవని తెలుస్తుందని చెప్పారు. ఇక ఢిల్లీ మోడల్లో ఏ ఒక్క ఆస్పత్రి, విద్యాసంస్ధలను కొత్తగా నిర్మించలేదని ప్రియాంక ఎద్దేవా చేశారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకు తెరదించేలా ఆ పార్టీ పలు సంకేతాలు పంపుతోంది. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడి వంటి వాడని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలకమని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు లేదని సిద్ధూ ఇటీవల వ్యాఖ్యానించిన నేపధ్యంలో చన్నీ సైతం ఇవే సంకేతాలు పంపారు.
పంచాయత్ ఆజ్ తక్ కార్యక్రమంలో చన్నీ మాట్లాడుతూ సిద్ధూ తమతో ఉన్నారని, రాహుల్ వెంట ఆయన నడుస్తున్నారని చెప్పారు. సిద్ధూ నాకు సోదరుడు..తమ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ అని చన్నీ పేర్కొన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా ప్రస్తుతం సీఎం చన్నీ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించడం పట్ల సిద్ధూ కినుక వహించిన సంగతి తెలిసిందే.ఇక 117 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పంజాబ్‌లో ఈనెల 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు పంజాబ్‌లో బహుముఖ పోరు జరగనుంది. పాలక కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుండగా శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), కెప్టెన్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెసతో పొత్తుతో బీజేపీ ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పంజాబ్ పీఠం దక్కాలంటే ఆయా పార్టీలు కనీసం 59 సీట్లను కైవసం చేసుకోవాల్సి ఉంది.