న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం విచారణకు హాజరైన క్రమంలో ఆ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ ప్రదర్శన చేపట్టాయి. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు పలువురు నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా పార్టీ నేత ప్రియాంక గాంధీ వారిని పరామర్శించారు.
ఈడీ ఎదుట రాహుల్ గాంధీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల నిరసన ప్రదర్శనలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టయిన నేతల్లో రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, హరీష్ రావత్, రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా, అధీర్ రంజన్ చౌధరి, కేసీ వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హుదా, పవన్ ఖేరా తదితరులున్నారు.
మోదీ సర్కార్ ఒత్తిడికి కాంగ్రెస్ తలవంచదని పవన్ ఖేరా పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు దర్యాప్తు ఏజెన్సీ సమన్లు జారీ చేసింది. ఇక సోమవారం మూడు గంటలకు పైగా రాహుల్‌ను ఈడీ ప్రశ్నించగా, జూన్ 23న ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరు కానున్నారు.