Priyanka Gandhi | త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటిస్తున్నాయి. అధికార బీజేపీ పార్టీ ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలోనే మరికొన్ని పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. అయితే, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఆమె డామన్ డయ్యూ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక్కడి నుంచి పోటీ చేయడాన్ని కాంగ్రెస్ డయ్యూ అధ్యక్షుడు కేతన్ పటేల్ స్వాగతించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ కొంత సమాచారాన్ని సేకరించాలని కోరినట్లు తెలుస్తున్నది. ఎక్కడ పోటీ చేస్తారనేదానిపై అంతిమంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చాలాసార్లు వార్తలు వచ్చినా.. ఇప్పటికీ బరిలోకి దిగలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ.. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఇన్చార్జీ బాధ్యతల నుంచి ఆమెను పార్టీ తప్పించింది. ఈ ఏడాది జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మొదట రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అంచనా వేసినా.. ప్రస్తుతం డామన్ డయ్యూ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ సైతం రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. గాంధీల కుటుంబానికి రాయ్‌బరేలీ కంచుకోటగా ఉన్నది. ప్రియాంక సైతం పోటీ చేస్తే ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల తర్వాత 2004, 2006 (ఉప ఎన్నికలు), 2009, 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సోనియాగాంధీ రాయ్‌బరేలి నుంచి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. అయితే, ప్రియాంకా గాంధీ ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఆమె 2004 లోక్‌సభ ఎన్నికల్లో తల్లి సోనియాగాంధీకి మద్దతుగా ప్రచారం నిర్వహించింది.
కానీ, క్రియాశీల రాజకీయాల్లోకి మాత్రం అడుగుపెట్టలేదు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. అయితే, అమేథీ, రాయ్‌బరేలికి మాత్రమే పరిమితమయ్యారు. 2009లోనూ ప్రచారం నిర్వహించారు. 2012లో ఆమెను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా జాబితాలో చోటు కల్పించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు తరఫున ప్రచారం చేపట్టారు. మరి ఈసారైనా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.