న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నిత్యం గతంలోనే ఎందుకు మగ్గుతుంటారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూలపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె స్పందించారు. ప్రధాని ఇప్పటికీ గతంలోనే ఉన్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యూపీలో తొలి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రియాంక గాంధీ బుధవారం ఓ వార్తాఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఏడేండ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు..అయినా ఆయన ఇప్పటికీ గతం గురించి తవ్వుతుంటారని వ్యాఖ్యానించారు. అసలు ఆయన భవిష్యత్ గురించి ఎందుకు మాట్లాడరని విస్మయం వ్యక్తం చేశారు. మోదీ తన ఏడేండ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎంతమంది దారిద్ర్య రేఖ ఎగువకు వచ్చారనే దానిపై మోదీ నోరు మెదపాలన్నారు. బీజేపీ హయాంలో తిరిగి దారిద్ర్య రేఖ దిగువకు పడిపోయిన పేదల సంఖ్య పెరిగిందని ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు.
దేశ స్వాతంత్ర్యం కోసం, అభివృద్ధి కోసం నెహ్రూ ఏం చేశారనేది ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. మీరు చరిత్రను చెరిపేయాలంటే అలాగే చేయండి..కానీ సత్యం బయటకు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇక యూపీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సాగుతుండగా విపక్షాలపై మోదీ మండిపడ్డారు. సహరన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని చెరకు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కసరత్తు సాగిస్తున్నామని అన్నారు. విపక్షాల మాటలను నమ్మవద్దని కాషాయ పార్టీకి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ట్రిపుల్ తలాక్‌ను తాము రద్దు చేయడంతో ముస్లిం మహిళలు బీజేపీకి మద్దతిస్తున్నారని అన్నారు. ఇక యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తలూ ఒడ్డుతుండగా, యోగి సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్ ఆసరాగా ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా..దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి నేతృత్వంలోని బీజేపీ కసరత్తు సాగిస్తోంది.