ప్రధాని నరేంద్ర మోదీ ఓ టూరిస్టు ప్రధాని అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దెప్పిపొడిచారు. పర్యటన అన్న పేరుతో దేశ విదేశాలన్నీ చుట్టివస్తారు కానీ, పక్కనే నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు మాత్రం వెళ్లరని విమర్శించారు. అలాంటి ప్రభుత్వం ప్రజల్ని పాలిస్తోందని మండిపడ్డారు. దేశంలో పెరిగిన ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జైపూర్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్, ప్రధాన కార్యదర్శి ప్రియాంక పాల్గొన్నారు.
యూపీలో కొన్ని కోట్ల రూపాయలను తమ ప్రచారం కోసం బీజేపీ ఖర్చు చేసుకుంటోందని, రైతులకు మాత్రం నయా పైస ఇవ్వడానికి వారికి చేతులు రావడం లేదని ప్రియాంక విమర్శించారు. ప్రజల బాగోగులు, సంక్షేమం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదని, కొంత మంది పారిశ్రామికవేత్తల కోసమే వీరు పనిచే స్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడూ సత్యాలు చెప్పలేదని, కానీ మతం పేరుతో విభజించడం మాత్రం నేర్చుకుందని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే బీజేపీకి అభివృద్ధి గుర్తుకు వస్తుందని ప్రియాంక మండిపడ్డారు.