న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై (Kiren Rijiju) ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు తాము అనర్హులమన్న ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాలకు చెందిన సుమారు 60 మంది ఎంపీలు సభా హక్కుల తీర్మానానికి మద్దతు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులను విమర్శించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్పై ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ‘మీరు కుర్చీని గౌరవించలేకపోతే, ఈ సభలో సభ్యులుగా ఉండే హక్కు మీకు లేదు’ అని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అన్నారు.
కాగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సాగరికా ఘోష్ దీనిపై స్పందించారు. ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో ఉండేందుకు అనర్హులన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై గురువారం ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. ఈ తీర్మానంపై 60 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేసినట్లు ఆమె తెలిపారు.
మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభను సజావుగా నడపడానికి కృషి చేయడం లేదని ఎంపీ సాగరికా ఘోష్ విమర్శించారు. దీనికి బదులు ప్రతిపక్షాలను పదేపదే అవమానించడాన్ని ఆయన ఎంచుకున్నారని ఆరోపించారు. ‘ప్రతిపక్ష సభ్యులను రిజిజు అవమానించారు. పార్లమెంటు లోపల, బయట వ్యక్తిగత పదాలు ఉపయోగించారు. ఆయన ఉన్నత పదవికి ఇది తగనిది. తన పదవిని ఆయన పూర్తిగా దుర్వినియోగం చేయడమే’ అని ఆమె అన్నారు.