PM Modi : ఇథియోపియా (Ethiopia) లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి అపూర్వ గౌరవం దక్కింది. అక్కడి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ తో సత్కరించింది. అడీస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ.. ప్రధాని మోదీని అవార్డుతో సత్కరించారు.
ప్రధాని మోదీ జోర్డాన్ పర్యటనను ముగించుకొని మంగళవారం ఇథియోపియా రాజధాని అడీస్ అబాబాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనకరమైన విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
వచ్చే ఐదేళ్లలో భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ రెట్టింపై 500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం ప్రధాని మోదీ వ్యక్తంచేశారు. భారత ఆర్థిక పురోగతిలో పాలుపంచుకొని లబ్ధి పొందాల్సిందిగా జోర్డాన్ వాణిజ్య సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కలిసి ద్వైపాక్షిక వాణిజ్య వేదికపై ప్రసంగించారు. యువరాజు హుసేన్తోపాటు జోర్డాన్ వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.