PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రేపు (గురువారం) సాయంత్రం 6 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి (BJP headquarters) వెళ్లనున్నారు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమావేశంలో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు మీడియాకు తెలిపాయి.
ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ తొలిసారి పార్టీ ఆఫీస్కు వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల గురించి కూడా శ్రేణులతో ప్రధాని చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో బీజేపీ నేతలు చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.