న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లోక్సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు వ్యక్తులు బహిరంగంగా అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారంటూ రాహుల్ పేరును నేరుగా ప్రస్తావించకుండా మోదీ మాటల దాడి చేశారు. భారత రాజ్యంపై యుద్ధం ప్రకటించిన వారికి రాజ్యాంగం గురించి గాని దేశ ఐక్యత గురించి కాని అర్థం చేసుకోలేరని ఆయన విమర్శించారు.
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు ప్రధాని మోదీ సమాధానమిస్తూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పైన, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పైన ఆరోపణలు గుప్పించారు. యువత భవిష్యత్తుకు కొన్ని పార్టీలు ఆప్ద(ఆపద) అంటూ ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ పథకాలతో ప్రజల డబ్బు అయిందని, కాని తాము మాత్రం అద్దాల మహల్ కట్టుకోలేదని పరోక్షంగా కేజ్రీవాల్ నిర్మించుకున్న అధికారిక నివాసాన్ని మోదీ ప్రస్తావించారు.
పేదల గుడిసెల్లోకి వెళ్లి ఫొటోలు తీసుకునే వారికి పార్లమెంట్లో పేదల గురించి మాట్లాడితే విసుగ్గానే ఉంటుందంటూ ఆయన రాహుల్పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరిగేవారికి ముస్లిం మహిళలు కష్టాలు ఎదుర్కోవడానికి తామే కారణమని తెలుసా అని మోదీ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు హక్కులు కల్పించామని ప్రధాని ప్రకటించారు.
తాము బూటకపు నినాదాలు ఇవ్వబోమని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని ఆయన తెలిపారు. ఐదు దశాబ్దాల క్రితం వరకు గరీబీ హఠావో నినాదాలు వినిపించేవని, ఇప్పుడు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని మోదీ తెలిపారు. 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు లభించాయని ఆయన చెప్పారు.