న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: గత ఐదేండ్ల తమ ప్రభుత్వ పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 17వ లోక్‌సభ ఐదేండ్ల కాలవ్యవధిని సంస్కరణ, పనితీరు, పరివర్తన(రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్) పీరియడ్‌గా చెప్పవచ్చని, దేశం వేగంగా ‘పెద్ద మార్పుల’ దిశగా పయనిస్తున్నదని అన్నారు.
బడ్జెట్ సమావేశాల చివరి రోజు సందర్భంగా మోదీ శనివారం లోక్‌సభలో మాట్లాడారు. గత ఐదేండ్లలో దేశ దిశను మార్చే పలు కీలకమైన సంస్కరణలు చేపట్టామని, ఇవి 21వ శతాబ్దంలో దేశానికి బలమైన పునాది వేశాయన్నారు. 17వ లోక్‌సభలో తమ ప్రభుత్వం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నదని పేర్కొన్నారు.
దేశానికి ఒకే రాజ్యాంగం ఉండాలని ప్రజలు ఎన్నో తరాలుగా కన్న కలలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్న మోదీ.. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించారు. ఈ ఐదేండ్లలో ఎదురైన కొవిడ్ వంటి పలు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దేశానికి సరైన దిశ ఇచ్చామని మోదీ చెప్పుకొచ్చారు.
సభను నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నడిపించారని పేర్కొంటూ స్పీకర్ ఓంబిర్లాను మోదీ ప్రశంసించారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కలను కూడా ఈ పీరియడ్‌లోనే నెరవేర్చుకొన్నామన్నారు. చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లుల ఆమోదాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఆర్థిక ప్రగతి నాశనంలో ఆరితేరారు:నిర్మల
గత ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని నాశనం చేయటంలో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని, స్వార్థ రాజకీయ కోసం యూపీఏ ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా దయనీయ స్థితికి తీసుకొచ్చిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. యూపీఏ హయాంతో పోల్చుతూ మోదీ సర్కార్ విడుదల చేసిన ‘శ్వేతపత్రం’పై రాజ్యసభలో శనివారం స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
ఆర్థికంపై కేంద్రం విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అబద్ధాల పత్రమని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఎద్దేవా చేశారు. ఎన్డీయే తప్పుల్ని, మోసపూరిత వాగ్దానాల్ని కప్పి పుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంగా ఆయన విమర్శించారు. శ్వేతపత్రంపై సభలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘వాజ్‌పేయి హయాంలో ద్రవ్యోల్బణం 4 శాతం లోపు ఉంది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ 2004-14 మధ్య ఇష్టమున్నట్టుగా వ్యవహరించింది. సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. తప్పుడు లక్ష్యాలతో కూడిన సబ్సిడీలు, నిధుల వ్యయం, నిర్లక్ష్యపు ఆర్థిక విధానం..ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జరిగింది’ అని అన్నారు. వాజ్‌పేయి తర్వాత దేశాన్ని ఆర్థికంగా కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లలేకపోయిందని, ఆర్థికంగా దయనీయంగా మారిన దేశాన్ని 2014లో ప్రస్తుత ఎన్డీయే సర్కార్‌కు వదిలేసిందని ఆమె అన్నారు. సాధించిన ప్రగతిని తుడిచి పెట్టడంలో కాంగ్రెస్ మాస్టర్ డిగ్రీ చేసిందని అన్నారు.
17వ లోక్‌సభలో తక్కువ సిట్టింగ్‌లు
17వ లోక్‌సభ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఐదేండ్ల పూర్తి కాలం ప్రభుత్వం నడిచిన సందర్భాల్లో అతి తక్కువ సార్లు లోక్‌సభ సమావేశమైన పీరియడ్‌గా 2019-24 నిలిచింది. 17వ లోక్‌సభ మొత్తంగా 272 సార్లు సమావేశమైందని మేధో సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ గణాంకాలు వెల్లడించాయి. 16, 15, 14వ లోక్‌సభలు వరుసగా 331, 332, 356 సార్లు సమావేశం కాగా.. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన మొదటి లోక్‌సభ(1952-57) అత్యధికంగా 677 సార్లు సిట్టింగ్‌లు జరిపింది. 2, 3వ లోక్‌సభలు వరుసగా 581, 578 సార్లు సమావేశం అయ్యాయి.
చరణ్ సింగ్‌ను అవమానిస్తున్నారు
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల వైఖరిపై చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌదరి చరణ్‌సింగ్, ఆయన వారసత్వాన్ని మీరు అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, జైరామ్ రమేశ్, ఇతర సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడంపై శనివారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత కంటే ముందుగా చరణ్ సింగ్ మనవడు, ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరికి మాట్లాడే అవకాశం ఇవ్వడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనిపై జగదీప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలోనే చరణ్ సింగ్‌కు భారతరత్న ఇచ్చేందుకు మీకు (కాంగ్రెస్‌కు) సమ యం దొరకలేదని అన్నారు. ఇది దేశ రైతులను అవమానించడమేనని అన్నారు. చర ణ్ సింగ్‌ను అవమానిస్తే సహించమని అన్నారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని అంటూనే ఏ ని బంధన ప్రకారం జయంత్‌కు తొలుత అవకాశమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.