(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలను కనేవారంటూ ముస్లింలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మోదీ యూటర్న్ తీసుకొన్నారు. ముస్లింలను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తూ ముస్లింలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యూస్ 18కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అయితే, ముస్లిం వ్యాఖ్యలపై మోదీ ఇలా యూటర్న్ తీసుకోవడానికి ఆయన మీద ఒత్తిడి పెరుగడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నష్టం జరుగకూడదనే
‘విశ్వగురు’ పేరిట ప్రచారం చేసుకొంటున్న మోదీ.. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలను చేయడం దేశంలోని ప్రధాన మీడియా సహా, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా తప్పుబట్టాయి. దీంతో పాటు గడిచిన నాలుగు దఫాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. ఇది బీజేపీకి ఎదురు దెబ్బేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి మోదీ వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక, ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేసిన మోదీపై చర్యలు తీసుకోవాలని ఈసీపై విపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇదే విషయమై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోదీ పాత్రపై అనుమానాలతో అమెరికా, యూకే ఆయనకు ట్రావెల్ వీసాను గతంలో నిరాకరించాయి. ఇప్పుడు ఇలాంటి విద్వేష వ్యాఖ్యలతో తనకు మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదమున్నదని మోదీ భావించి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తున్నది. ఇలాంటి సమయంలో వివరణ ఇవ్వకపోతే పరిస్థితి చేజారవచ్చని మోదీ భావించి ఉండవచ్చని, ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కలుపుకుపోతున్నట్టు కనికట్టు
ఎక్కడైనా తాను మాత్రమే హైలైట్ కావాలని ప్రధాని మోదీ కోరుకొంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, మంగళవారం వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ.. ఎన్డీయే కూటమి నేతలతో, కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలతో బలప్రదర్శన చేశారు. అంతేకాదు.. తన నామినేషన్ ప్రపోజర్లలో ఒక బ్రాహ్మిన్, ఇద్దరు ఓబీసీలు, ఒక దళిత వ్యక్తి ఉండేలా చూసుకొన్నారు. అలా తాను అన్ని వర్గాలవారిని కలుపుకుపోతున్నట్టు కనికట్టు చేసే ప్రయత్నం చేశారు.