PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ అధికారులతో సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (CDS) అనిల్ చౌహాన్ సైతం సమావేశానికి హాజరయ్యారు. దాదాపు సమావేశం గంటన్నర పాటు కొనసాగింది. దక్షిణ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరిగింది. ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనకు దృఢచిత్తంతో ఉన్నామని తెలిపారు. సాయుధ దళాల సామర్థ్యంపై పూర్తిస్థాయి నమ్మకం ఉందన్నారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యాచరణను రూపొందించుకోవడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని… ఎప్పుడు, ఎలా స్పందించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ సైన్యానికి ఉందని చెప్పారు. పహల్గాం దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను వేటాడి ఊహకు అందని విధంగా శిక్షిస్తామన్నారు.