Nalanda University | రాజ్‌గిర్, జూన్ 19: ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఘన కీర్తి కలిగిన నలంద విశ్వవిద్యాలయం విలసిల్లిన చోట కొత్తగా నిర్మించిన ఆ యూనివర్సిటీ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. బీహార్ గవర్నర్ అర్లేకర్, సీఎం నితీశ్ కుమార్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు కొద్ది సేపు ప్రధాని మోదీ వర్సిటీకి సమీపంలోని నలంద మహా విహారను సందర్శించారు. 2014 నుంచి నలంద యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌ను అత్యాధునిక పరిశోధనలతో కూడిన ఉన్నత విద్యా వ్యవస్థ ద్వారా మళ్లీ అత్యంత ప్రముఖ జ్ఞాన కేంద్రంగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. ఇందుకోసం దేశం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని చెప్పారు. ఇటీవల క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో 46 భారత విద్యా సంస్థలకు చోటు దక్కడం ఇందుకు నిదర్శనమన్నారు. పదేండ్ల క్రితం నాటితో పోలిస్తే దేశంలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, ఐఐటీలు, ఐఐఎంల సంఖ్య పెరిగిందని తెలిపారు. పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లను కేటాయించిదని తెలిపారు.