న్యూఢిల్లీ, ఆగస్టు 19 : రాష్ర్టాలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఏప్రిల్ 12 నాడు వెలువడిన ఉత్తర్వులను మార్చేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆనాటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేయదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తెలిపింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువు విధించటం చట్టపరంగా సరైనదేనా? కాదా? అంటూ రాష్ట్రపతి సూచన కోరటంపై తమిళనాడు, కేరళ అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై మంగళవారం విచారణ జరుపుతూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
సలహాదారు పాత్రలో తాము విచారణ జరుపుతున్నామని, అప్పిలెట్గా విచారణ చేయబోవటం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్టమైన కేసులో చట్ట ప్రకారం సరైన తీర్పు వెలువరించలేదన్న అభిప్రాయాన్ని ఇవ్వగలం గానీ, ఆనాటి తీర్పును తోసిపుచ్చలేం..అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో అధికార డీఎంకే ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి సమ్మతి తెలియజేయకుండా, పెండింగ్లో ఉంచటం చట్టవిరుద్ధం, ఏకపక్షం.. అంటూ ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.