న్యూఢిల్లీ, మే 23: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగితే ఆ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఈమేరకు ఒక సంయుక్త ప్రకటన జారీ చేసే అవకాశముంది. ఆయా పార్టీల నేతలు బుధవారం సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు తృణమూల్, సీపీఐ పార్టీలు మంగళవారం ప్రకటించాయి.
‘పార్లమెంట్ కేవలం ఒక భవనం మాత్రమే కాదు. పాత సంప్రదాయాలు, నియమాలు, విలువలు భారత ప్రజాస్వామ్యానికి పునాది. నేను, నాకోసం, నాది అన్నట్టుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ చూపుతున్నారు’ అని ట్విట్టర్లో టీఎంసీ రాజ్యసభ నేత డెరిక్ ఓబ్రెయిన్ విమర్శించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రకటించారు. మే 28న తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలకు, ఎంపీలకు ఆహ్వానాలు పంపగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరపాల్సిందేనంటూ పలు రాజకీయ పార్టీలు మోదీ సర్కార్‌కు సూచించాయి. ప్రారంభోత్సవంలో పాల్గొనాలా? లేదా? అన్నది త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ విలేకర్లకు తెలిపారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ప్రకటించింది. మే 28నాటి కార్యక్రమంలో పాల్గొనబోమని తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిర్వహించకపోవటం తమను తీవ్రంగా నిరాశపర్చిందని ఆప్ తెలిపింది. ‘పలు రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేసిన నేపథ్యంలో, మేము కూడా హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాం’ అని ఆప్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.