President Droupadi Murmu : భారతదేశం ఉగ్రదాడులను ఏమాత్రం సహించదు అనడానికి ‘ఆపరేషన్ సిందూర్’ ఒక ఉదాహరణ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అన్నారు. పహల్గాం ఉద్రదాడికి ప్రతిచర్యగా చేపట్టిన ఈ ఆపరేషన్ చరిత్రలో నిలిచిపోతుందని ప్రథమ పౌరురాలు తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రెసిడెంట్ మనదేశ సైనిక శక్తిని కొనియాడారు. పహల్గాంలో అమాయకులను బలిగొనడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
స్వాతంత్య్ర దినోత్సవం ముందురోజు జాతినుద్దేశించి ప్రసంగించం ఆనవాయితీ. గురువారం మాట్లాడిన రాష్ట్రపతి పహల్గాంపై ఉగ్రదాడికి భారత ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆపరేషన్ సిందూర్ను చేపట్టిందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న పోరాటానికి ఆపరేషన్ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్రపతి వెల్లడించారు. పహల్గాంలోకి చొరబడిన టెర్రిరిస్టులు అమాయక పర్యటకులను బలిగొనడాన్ని పిరికిపంద చర్యగా పేర్కొన్న ముర్ము.. పక్కా ప్రాణాళికతో, కచ్చితత్వంతో సాగిన ఈ ఆపరేషన్ భారత సైనిక శక్తిని మరోసారి ప్రపంచానికి చాటిందని అన్నారు.
LIVE: President Droupadi Murmu’s address to the nation on the eve of the 79th Independence Day https://t.co/AiBSvUP5La
— President of India (@rashtrapatibhvn) August 14, 2025
‘దేశాన్ని కాపాడేందుకు భారత సైన్యం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వదా సిద్ధంగా ఉంటుందని ఆపరేషన్ సిందూర్ ద్వారా మరోసారి స్పష్టమైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటానికి ఈ ఆపరేషన్ ప్రతీకగా నిలుస్తుంది. పహల్గాంలో దాడితో మనల్ని విడదీయాలనుకున్న వాళ్లకు గట్టిగా బుద్ది చెప్పాం. ఈ కష్ట సమయంలో దేశమంతా ఒక్కతాటిపై నిలిచింది’ అని ముర్ము వెల్లడించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో పాటు ఎగుమతులు పెరిగాయని రాష్ట్రపతి అన్నారు.