Padma Awards | దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, హీరో బాలకృష్ణ సహా పలువురు ప్రముఖులు సహా 71 మంది అవార్డులను అందుకున్నారు.
తాజాగా మిగతా వారందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. కళారంగం నుంచి నటి డాక్టర్ శోభన చంద్రకుమార్ పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ పద్మశ్రీని స్వీకరించారు. ఏపీ నుంచి వీరాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. కన్నడ నటుడు అనంత్ నాగ్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అలాగే, సామాజిక సేవరంగంలో చేసిన కృషికి సాధ్వి రితంభర పద్మ భూషణ్, సంగీతకారుడు రికీ కేజ్ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ప్రజా వ్యవహారాల్లో చేసిన కృషికి గాను న్యాయమూర్తి (రిటైర్డ్) జగదీష్ సింగ్ ఖేహర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేశారు.
గాయని శారదా సిన్హా (మరణానంతరం)కు పద్మవిభూషణ్‌ను ప్రదానం చేయగా.. ఆమె తరఫున తనయుడు అవార్డును అందుకున్నారు. కళారంగంలో కుముదిని రజనీకాంత్ లఖియా (మరణానంతరం)కి పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేయగా.. ఆమె తరఫున మనువడు అవార్డును స్వీకరించారు. సాహిత్య-విద్యారంగాల్లో చేసిన కృషికి బిబేక్ దేబ్రాయ్ (మరణానంతరం) పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేయగా.. ఆయన తరఫున ఆమె భార్య ఈ వార్డును స్వీకరించారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.