న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రేప్ కేసుల్లో కోర్టు తీర్పులు వెలువడటానికి ఓ తరం పడుతున్నదని, కోర్టుల్లో వాయిదా సంస్కృతి పోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యాయ ప్రక్రియలో సున్నితత్వం లోపించిందన్న భావన సామాన్యుల్లో ఏర్పడిందని చెప్పారు. సత్వర న్యాయం కోసం తగిన కృషి చేయాల్సిన అవసరముందని ముర్ము అభిప్రాయపడ్డారు. జిల్లా న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు భారీగా పెరిగిపోవటం పెద్ద సవాల్‌గా మారిందని అన్నారు.
ఆదివారం జిల్లా న్యాయవ్యవస్థపై ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, రేప్ కేసులు సహా అత్యంత హేయమైన నేరాల్లోనూ తీర్పులకు చాలా సమయం పడుతున్నదని, దీనివల్ల బాధితుల్లో సంతోషం మిగలదని ముర్ము అన్నారు.
‘పెండింగ్ కేసులను తగ్గించేందుకు పరిష్కార మార్గం వెతకాలి. తరుచూ లోక్ అదాలత్‌లు నిర్వహించాలి’ అని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏండ్లు అయిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం నూతన చిహ్నాన్ని, జెండాను రాష్ట్రపతి ఆవిష్కరించారు. అశోక చక్ర, సుప్రీంకోర్టు భవనం, రాజ్యాంగం పుస్తకాలతో కూడిన ఈ జెండాను న్యూఢిల్లీలోని ‘నిఫ్ట్’ డిజైన్ చేసింది.
జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి జాతీయస్థాయి రిక్రూట్మెంట్ విధానాన్ని తీసుకురావాలని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ, పెండింగ్ కేసుల పరిష్కారానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఆకర్షించటం అత్యంత కీలకమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒక నియామక క్యాలెండర్‌ను రూపొందించాల్సిన సమయం వచ్చిందన్నారు. జిల్లా కోర్టులు మొత్తం న్యాయవ్యవస్థకు వెన్నెముక వంటివని అన్నారు.
జిల్లా స్థాయిలో జ్యుడిషియల్ ఖాళీలు 28శాతం, నాన్-జ్యుడిషియల్ ఖాళీలు 27 శాతమున్నాయని, పూర్తిస్థాయి సిబ్బంది ఉంటేనే కేసుల సత్వర పరిష్కారానికి అవకాశముంటుందని, ఈ విషయాలన్నింటిపైనా సదస్సులో చర్చించామని సీజేఐ చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను క్లియర్ చేయడానికి యాక్షన్ ప్లాన్ చేపట్టామని, 2025లో మూడో దశ చేపడుతున్నామని తెలిపారు. జిల్లా కోర్టుల్లో మౌలిక వసతులు మారాలని, దేశంలో కేవలం 6.7 శాతం కోర్టులు మాత్రమే మహిళలకు అనుకూలంగా ఉన్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు.