PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Naredra Modi) 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ఉపరాష్ట్రపతి (Vice president of India) సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.
‘ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అసాధారణ నాయకత్వం, కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా చేశారు. నేడు ప్రపంచం మొత్తం మీ మార్గదర్శకాలపై విశ్వాసంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మీ నాయకత్వంలో దేశం పురోగతి చెంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
అదేవిధంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దార్శనిక నాయకత్వంలో ప్రపంచ వేదికలపై భారత్ తన ముద్ర వేస్తోంది. అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘త్యాగం, అంకితభావానికి చిహ్నం, కోట్లాది మంది దేశ ప్రజల ప్రేమను పొందుతోన్న ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలకు పైగా దేశ ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. నేషన్ ఫస్ట్ అనే మీ నినాదం ప్రతి పౌరుడికి ప్రేరణ’ అని షా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు, నవ భారత నిర్మాత ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు.
‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదంతో సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి, స్వావలంబనకు, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాని మోదీ అనేక చర్యలు తీసుకున్నారు. మీ దార్శనిక నాయకత్వంలో మన దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. మీ మార్గదర్శకత్వం బీజేపీ కార్యకర్తలు అందరికీ స్ఫూర్తిదాయం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.