న్యూఢిల్లీ: ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణలతో కూడిన వాతావరణం ఉన్నదని, అటువంటి సమయంలో భారత దేశం శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. 77వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆమె ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నిరుడు ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని, అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు చురుగ్గా, సాధికారతతో భాగస్వాములు కావడం చాలా ముఖ్యమని తెలిపారు.
2047నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి నారీ శక్తి చేస్తున్న కృషిని ప్రశంసించారు. దశాబ్దాల నుంచి పేదరికంలో మగ్గిపోయిన లక్షలాది మందిని దారిద్య్ర రేఖకు ఎగువకు తీసుకురాగలిగినట్లు చెప్పారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పయనిస్తున్నదని తెలిపారు.