President Droupadi Murmu | న్యూఢిల్లీ: భారతీయులుగా మన ఉమ్మడి గుర్తింపునకు బలమైన పునాది వంటిది మన దేశ రాజ్యాంగమని, అది మనందరినీ ఓ కుటుంబంగా కలిపి ఉంచుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మన దేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నైతిక ప్రమాణాలు వేల సంవత్సరాల నుంచి మన ప్రవర్తనలో భాగంగా ఉన్నాయని, అందువల్ల రాజ్యాంగం సజీవ దస్తావేజుగా మారిందని చెప్పారు. భారత దేశ నాగరికత వారసత్వంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం ఎల్లప్పుడూ భాగమేనన్నారు.
గడచిన 75 ఏండ్లలో మన ప్రగతికి రాజ్యాంగం బాటలు పరచిందన్నారు. ఈ 75 ఏండ్లలో మన గణతంత్ర దేశానికి లభించిన సర్వతోముఖాభివృద్ధి ఫలాలు రాజ్యాంగానికి అనుబంధంగా వచ్చినవేనని వివరించారు. జమిలి ఎన్నికల వల్ల సుపరిపాలనను పునర్నిర్వచించవచ్చునన్నారు. పాలనలో నిలకడను సాధించవచ్చునని, విధానపరమైన ప్రతిష్టంభనను నిరోధించవచ్చునని, వనరుల దారి మళ్లింపును తగ్గించవచ్చునని చెప్పారు. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త నేర న్యాయ చట్టాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మన దేశ ఆర్థికాభివృద్ధిలో రైతులు, కార్మికుల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో జరుగుతున్న ఆర్థికాభివృద్ది వల్ల రైతులు, కార్మికుల ఆదాయం పెరిగిందని రాష్ట్రపతి తెలిపారు.