న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఉపాధి హామీ చట్టానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) సమూల మార్పులు చేస్తూ దాని స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు-2025’ మరికొద్ది రోజుల్లో చట్టంగా అమల్లోకి రాబోతున్నది. దీనికి సంక్షిప్త రూపమే ‘వీబీ-జీ రామ్ జీ’. గ్రామీణ ఉపాధి కార్యక్రమంలో సమూల మార్పుల్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరు తొలగిస్తూ, రాష్ర్టాలపై నిధుల భారాన్ని మరింత పెంచటాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. పని కోరే హక్కును కొత్త బిల్లు కాలరాసిందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా పాత చట్టాన్ని మార్చుతూ, కొత్త దాన్ని తీసుకొచ్చామని కేంద్రం తెలిపింది.