న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం రాజ్యసభ సభ్యులుగా నలుగురిని నామినేట్ చేశారు. ఈ నామినేషన్‌ను కేంద్ర హోం శాఖ నోటిఫై చేసింది. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్, కేరళ సామాజికవేత్త, ఉపాధ్యాయుడు సదానంద్ రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఉజ్వల్ నికమ్ 26/11 ముంబై ఉగ్రదాడి కేసు వంటి హై ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. ఆయన 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పోటీ చేసి పరాజయంపాలయ్యారు.
హర్షవర్ధన్ శ్రింగ్లా గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా, అమెరికా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ దేశాల్లో రాయబారిగా పని చేశారు. సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలందించారు. సామాజిక కార్యకర్తగా మన్ననలు పొందారు. 1994లో జరిగిన దాడిలో ఆయన తన రెండు కాళ్లను కోల్పోయారు. అసోసియేట్ ప్రొఫెసర్ మీనాక్షి జైన్ ప్రముఖ చరిత్రకారిణి. 2020లో ఆమెకు ‘పద్మశ్రీ’ లభించింది. భారతీయ సంస్కృతి, సామాజిక అంశాలపై ఆమె లోతైన పరిశోధనలు చేశారు.