Droupadi Murmu : బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Actor Dharmendra) మృతికి రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ధర్మేంద్ర మృతి భారత సినిమాకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన తన దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు.
‘అలనాటి నటుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు ధర్మేంద్ర మృతి భారత సినిమా తీరని లోటు. ఆయన తన దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన, మరుపురాని పాత్రలు పోషించారు. భారత సినిమాకు ఆయన మహోన్నతమైన వ్యక్తి. ధర్మేంద్ర కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా’ అని రాష్ట్రపతి తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర సోమవారం మధ్యాహ్నం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆ తర్వాత ముంబైలోని విలే పార్లే శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను పూర్తిచేశారు.